చిరు ఉయ్యాలవాడ ఫాస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్న జక్కన్న
‘బాహుబలి’తో రాజమౌళి ఇండియన్ సినిమాను ఎంతగా ఇన్ స్పైర్ చేశాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మలయాళంలో వెయ్యి కోట్లతో ‘మహాభారతం’ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నా.. అల్లు అరవింద్ రూ.500 కోట్లతో ‘రామాయణం’ అనౌన్స్ చేశాడన్నా.. సుందర్ రూ.250 కోట్లతో ‘సంగమిత్ర’ తీసే ప్రయత్నం చేస్తున్నాడన్నా.. అన్నింటికీ ఆ ధైర్యాన్నిచ్చింది దర్శక ధీరుడు రాజమౌళే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాను ముందు మామూలుగా తీయాలనుకుని.. ఆ తర్వాత దాన్ని భారీ స్థాయికి తీసుకెళ్లేందుకు కొత్తగా ప్రణాళికలు వేయడానికి కూడా ‘బాహుబలి’తో రాజమౌళి స్ఫూర్తిగా నిలిచాడనడంలో సందేహం లేదు.

మొత్తానికి పది నెలలుగా జరుగుతున్న స్క్రిప్టు పనులు.. ప్రి ప్రొడక్షన్ వర్క్ ఓ కొలిక్కి వచ్చి ఈ మధ్యే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా దీని మోషన్ పోస్టర్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఆ పోస్టర్ మామూలుగా ఉండదని.. అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు. ఈ సందర్భంగా చిత్రంలో నటించబోయే కొందరు కీలక పాత్రధారుల స్కెచ్ లు కూడా చూపిస్తారట. చాలా పెద్ద ఎత్తున జరగబోతున్న మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాజమౌళే అని సమాచారం. ‘ఉయ్యాలవాడ..’కు పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన రాజమౌళి చేతుల మీదుగానే మోషన్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నారు. ‘ఉయ్యాలవాడ..’ను పాన్ ఇండియన్ సినిమాగా తీయాలని భావిస్తున్న నేపథ్యంలో రాజమౌళి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ లాంచ్ చేస్తే దేశవ్యాప్తంగా మంచి ప్రచారం వస్తుందని రామ్ చరణ్ ఇలా ప్లాన్ చేశాడంటున్నారు.
ThanQ Visit Again.

Related Posts