హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి గారు
మెగాస్టార్‌ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరిది. అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్‌ అయినా, చిరంజీవిగానే ఆయన సుపరిచితుడు. కేంద్ర మంత్రి కాకముందే చిరంజీవికి దేశవ్యాప్తంగా పాపులారిటీ వుండది. ఎందుకంటే, తన డాన్సులతో తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, బాలీవుడ్‌లోనూ ఓ ఊపు ఊపేశారు చిరంజీవి. బాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా, అక్కడా తన ఉనికిని చాటుకున్నారాయన. 
తెలుగు తెరపై రెండు దశాబ్దాలపాటు ఏకఛత్రాధిపత్యం చిరంజీవిదే. నెంబర్‌ వన్‌ అన్న పొజిషన్‌ జోలికి ఇంకొకర్ని రానివ్వలేదాయన. తెలుగు సినీ బాక్సాఫీస్‌కి చిరంజీవి కొత్త అర్థం చెప్పారు. రికార్డులంటే చిరంజీవి మాత్రమే.. అనేంతలా తెలుగు సినీ పరిశ్రమని శాసించారు చిరంజీవి. ఈ విషయంలో ఎవరూ విభేదించే అవకాశాలే లేవు. ఫ్లాప్‌ సినిమా అంటే ఐదు నుంచి ఏడు వారాలు థియేటర్లలో ప్రదర్శితమయ్యేది. చిరంజీవితో సినిమా తీసి నష్టపోయినవారు లేరు, ఆయనకి స్టార్‌డమ్‌ వచ్చాక. ఫ్లాపయినా నిర్మాత సేఫ్‌.. హిట్టయితే, నిర్మాతకి పండగే పండగ.. ఇదీ తెలుగు సినీ రంగంలో చిరంజీవికి మాత్రమే చెల్లిన 'లెక్క'. 
రోజులు మారాయి. 'ఇంద్ర', 'ఠాగూర్‌' తర్వాత తెలుగు సినిమా లెక్కలూ మారిపోయాయి. సరిగ్గా ఆ టైమ్‌లోనే చిరంజీవి సినిమాల్ని తగ్గించేశారు. 'శంకర్‌దాదా జిందాబాద్‌' తర్వాత చిరంజీవి హీరోగా సినిమా ఇప్పటిదాకా రాలేదు. దాదాపు పదేళ్ళపాటు చిరంజీవి వెండితెరకు దూరమయ్యారు. 'మగధీర', 'బ్రూస్‌లీ' సినిమాల్లో కనిపించినా, చిరంజీవి హీరోగా సినిమా అయితే ఈ మధ్యకాలంలో రాలేదు. కాలం తెచ్చిన మార్పులెన్నో వున్నాయి. బాక్సాఫీస్‌ లెక్కలు బాగా మారిపోయాయి. 
ఏడాది పాటు సినిమా ప్రదర్శితమవడం, 175 రోజుల ప్రదర్శితమవడం, హండ్రెడ్‌ డేస్‌.. 50 డేస్‌.. అనే ప్రశ్నే లేదిప్పుడు. తొలి రోజు ఎంత.? తొలి వారం ఎంత.? ఇదే లెక్క చుట్టూ నిర్మాతలు నానా తంటాలూ పడ్తున్నారు. ఆ లెక్కలు పట్టుకునే, స్టార్‌డమ్‌ అంటూ కొందరు హీరోలు, వారి అభిమానులు విర్రవీగుతున్నారు. కానీ, 'వన్‌ టూ టెన్‌ చిరంజీవిగారే.. ఆ తర్వాతే మేం ఎవరమైనా..' అని ఓ సందర్భంలో మహేష్‌ వ్యాఖ్యానించాడు. అది చిరంజీవి మీద గౌరవంతో అన్నాడో, నిజంగానే అన్నాడోగానీ, అది నిజం. 
పెద్ద హీరోల సినిమాలు హిట్టయితే ఓకే.. లేదంటే, నష్టాలు దారుణంగా వుంటున్నాయి. హిట్టయినా, నిర్మాతలకు డబ్బులు రాని పరిస్థితి. హైప్‌ పెంచడం కోసం ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసేయడం, ఆ తర్వాత చతికిలపడ్డం.. ఇది తెలుగు సినిమాకి, అందునా పెద్ద సినిమాలకు పరమ రొటీన్‌ వ్యవహారంగా మారిపోయింది. ఈ లెక్కల నడుమ, చిరంజీవి హీరోగా కొత్త సినిమా రానుంది. అందుకే, ఈ ఏడాది పుట్టినరోజు చిరంజీవికి వెరీ వెరీ స్పెషల్‌. 
బాలీవుడ్‌లో ఒకప్పుడు బాక్సాఫీస్‌ని శాసించిన అమితాబ్‌ బచ్చన్‌, ఇప్పుడు తనకు సూటయిన సినిమాలే చేసుకుంటున్నారు. కోలీవుడ్‌లో రజనీకాంత్‌ తీరు వేరు. తన సినిమాలతో ప్రేక్షకుల్ని, డిస్ట్రిబ్యూటర్లని, బయ్యర్లనీ, నిర్మాతల్నీ నిలువునా ముంచేస్తున్నారు. ఆకాశాన్నంటే అంచనాల నడుమ రజనీకాంత్‌ అన్న పేరు, సినిమా పబ్లిసిటీకి పనికొస్తుంది తప్ప, ఆ సినిమా నిర్మాతని కాపాడలేకపోతోంది. మరి, చిరంజీవి పరిస్థితేంటి.? 
తమిళ సినిమా 'కత్తి'ని చిరంజీవి రీమేక్‌ చేస్తున్న విషయం విదితమే. మరి, ఈ సినిమాతో చిరంజీవి, తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి కొత్త అర్థం చెబుతారా.? చెప్పగలిగితే మాత్రం.. మహేష్‌ మాట నూటికి నూరుపాళ్ళూ నిజం. వన్‌ టూ టెన్‌ చిరంజీవే. ఓవర్సీస్‌ లెక్కలు, భారీ అంచనాలు, తొలి రోజు వసూళ్ళు.. వీటన్నిటి నడుమ, మెగాస్టార్‌ ఇమడలేకపోతే మాత్రం.. కష్టమే.! 
ఏదిఏమైనా, సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు తెరపై సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్న మెగాస్టార్‌ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు అందించేద్దాం. హ్యాపీ బర్త్‌ డే టూ మెగాస్టార్‌ చిరంజీవి.

‘పునాది రాళ్లు’ చిత్రంతో టాలీవుడ్ లో నటుడిగా పునాది వేసుకొని ఆ తరువాత వరుస సూపర్ డూపర్ హిట్స్ తో విజేత గా మారి ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీ గా ముద్ర వేసుకొని గ్యాంగ్ లీడర్ బిరుదు తో ముఠా మేస్త్రి అనిపించుకోవడం ఒక్క చిరంజీవి కే సొంతం.. టాలీవుడ్ సినిమాకు తన డాన్సులతో నటనతో చిరు మరింత కళ తీసుకొచ్చాడు. స్టార్టింగ్ లో విలన్ గా అలరించిన కొణిదెల శివ శంకర వర ప్రసాద్ అంచెలంచెలుగా అగ్ర కథానాయకుడిగా ఎదిగి తెలుగు ప్రేక్షకులతో మెగా స్టార్ అని పిలిపించుకున్నాడు. ఇక తొలిసారి కోటి రూపాయల పారితోషికం అందుకొని సంచలనం సృష్టించాడు మెగా స్టార్. ఎనలేని అభిమానులతో పాటు తిరుగులేని రికార్డులు కూడా చిరు సొంతం. చిరు చిత్రం వస్తుందంటే చాలు ఆ రోజు మెగాభిమానులతో పాటు ప్రేక్షకులకూ పండగే. 

ThanQ Visit Again.

Related Posts