ISM Movie Telugu Review'ఇజం' రివ్యూ

నటీనటులు: కళ్యాణ్ రామ్-అదితి ఆర్య-జగపతిబాబు-తనికెళ్ల భరణి-పోసాని కృష్ణమురళి-గొల్లపూడి మారుతీరావు-వెన్నెల కిషోర్-శత్రు తదితరులు

సంగీతం: అనూప్ రూబెన్స్

ఛాయాగ్రహణం: ముఖేష్

నిర్మాత: కళ్యాణ్ రామ్

రచన- దర్శకత్వం: పూరి జగన్నాథ్

ఎక్కువగా కొత్త దర్శకులతోనే పని చేస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇక పూరి జగన్నాథేమో.. ఎక్కువగా పెద్ద హీరోలతో పని చేస్తుంటాడు. వీళ్లిద్దరి కలయిక ఆశ్చర్యం కలిగించేదే. పైగా ‘ఇజం’ అనే ఆసక్తికర టైటిల్.. కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్.. స్టైలిష్ ప్రోమోస్.. అన్నీ కూడా సినిమా మీద ఆసక్తి రేకెత్తించాయి. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఇజం’ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: ఇండియాలో ఉన్న పేరుమోసిన రాజకీయ నాయకుల బ్లాక్ మనీని తన దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా కాపాడుతూ వేరే దేశంలోని ఒక దీవిలో అజ్నాతవాసం గడుపుతుంటాడు మాఫియా డాన్ జావెద్ ఇబ్రహీం (జగపతిబాబు). అతడి కూతురు ఆలియా (అదితి ఆర్య)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు స్ట్రీట్ ఫైటర్ కళ్యాణ్ రామ్ (నందమూరి కళ్యాణ్ రామ్). ముందు కళ్యాణ్ ను అసహ్యించుకున్నా ఆ తర్వాత అతణ్ని ప్రేమిస్తుంది ఆలియా. అనుకోకుండా కళ్యాణ్ తో జావెద్ కు స్నేహం కుదురుతుంది. కళ్యాణ్ ప్రేమిస్తోంది తన కూతుర్నే అని తెలియకుండా అతడికి పరోక్షంగా జావెదే సాయం చేస్తాడు. ఐతే తన కూతురు ప్రేమిస్తోంది కళ్యాణ్ నే అని తెలిశాక జావెద్ ఉగ్రరూపం దాలుస్తాడు. అప్పుడే కళ్యాణ్ తన గుట్టు విప్పడానికే వచ్చాడని తెలుస్తుంది. ఇంతకీ కళ్యాణ్ అసలు పేరేంటి.. అతడి మిషన్ ఏంటి.. దాన్ని అతను ఎలా నడిపించాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: లక్షల కోట్ల బ్లాక్ మనీని డీల్ చేసే ఒక డాన్. అతడికి కరీం బీడీ తాగకపోతే నోరు లాగేస్తుందట. ఆ డాన్ కు దగ్గర్లో కూర్చుని అదే బ్రాండు బీడీ కాలుస్తాడు హీరో. అంతే ఆ డాన్ లేచి వెళ్లి.. హీరో పక్కన వాలిపోతాడు. అతడితో ఫ్రెండ్షిప్ చేసేస్తాడు. ఓ అమ్మాయిని ఎలా పడేయాలో తెలియక హీరో తల బద్దలు కొట్టుకుంటుంటే.. ఒక పొయెటిక్ డైలాగ్ నేర్పిస్తాడు. హీరో అది వెళ్లి అతడి కూతురికే చెప్పి ఆమెను ప్రేమలో పడేస్తాడు. ఇలా తండ్రీ కూతుళ్లిద్దరినీ పడేసి గుట్టు మొత్తం రట్టు చేసేస్తాడు హీరో. ఇలా సాగుతాయి ‘ఇజం’ సినిమాలోని సన్నివేశాలు. ఇలాంటి సన్నివేశాలతో మొదలుపెట్టి.. అవినీతి మీద పోరాటం అంటూ ఒక సీరియస్ కథ చెబితే ఎలా ఉంటుంది?

అవినీతి మీద పోరాటం నేపథ్యంలో భారతీయుడు.. ఠాగూర్.. అపరిచితుడు లాంటి సినిమాలు చాలా చూశాం. వాటిలో కమర్షియల్ విలువలకు ఢోకా లేదు. అలాగే సీరియస్ నెస్ కూడా మిస్ కాలేదు. ఇలాంటి కథలకు మసాలాలు ఎన్ని అద్దినా బేసిక్ ప్లాట్ విషయంలో కొంచెం సీరియస్ నెస్ ఆశిస్తాం. కథ ఎమోషనల్ గా ప్రేక్షకుడిని కదిలించడం ఇక్కడ చాలా కీలకమైన విషయం. ‘ఇజం’ సినిమాలో అదే మిస్సయింది. జూలియన్ అసాంజె బయటపెట్టిన వికీ లీక్స్ ఆధారంగా అల్లుకున్న కథ ఇది. ఎంచుకున్న ప్లాట్ ఓకే కానీ.. దాన్ని నరేట్ చేసిన విధానమే సరిగా లేదు. 

డెప్త్ లేని.. బలహీనమైన క్యారెక్టర్లే ‘ఇజం’ సినిమాకు బలహీనత. ముఖ్యంగా ఈ కథకు కీలకమైన జగపతి బాబు క్యారెక్టరే తేలిపోవడంతో సినిమాలోనూ సీరియస్ నెస్ మిస్సయింది. విలన్.. హీరో బీడీ ఫ్రెండ్షిప్ ఆ సమయానికి సరదాగానే అనిపిస్తుంది కానీ.. అసలు హీరో లక్ష్యమేంటో తెలిశాక మాత్రం సిల్లీగా తోస్తుంది. ఇక హీరో హీరోయిన్ల ప్రేమకథ ఎప్పట్లాగే పూరి తరహాలోనే సాగిపోతుంది. హీరో హీరోయిన్ని అల్లరి పెట్టడం.. ఒక టీజింగ్ సాంగ్.. కట్ చేస్తే ఆమె ప్రేమలో పడిపోవడం.. ఇలా నడుస్తుంది ప్రథమార్ధం. ఇంటర్వెల్ పాయింట్ ఏంటో ముందే ప్రేక్షకుడు ఒక అంచనాకు వచ్చేస్తాడు. ప్రథమార్ధం ఒక మాదిరిగా టైంపాస్ అయితే చేయిస్తుంది.

ఇక ద్వితీయార్ధంలో ‘ఇజం’ అసలు కథ మొదలవుతుంది. హీరో మిషన్ ఏంటన్నది చూపించడం మొదలుపెడతారు. వికీ లీక్స్ కాన్సెప్ట్ గుర్తుకు తెస్తూ సాగుతాయి సన్నివేశాలు. ఇవి ఏమంత ఆసక్తి కలిగించవు. వికీ లీక్స్ కాన్సెప్ట్ మీద మీడియాలో వచ్చిన వార్తల్ని బేస్ చేసుకుని.. పైపైన సన్నివేశాల్ని తీసేశాడు పూరి. హీరో కాబట్టి ఏమైనా చేసేస్తాడు అన్నట్లుగా అతను వ్యవస్థ మొత్తాన్ని చేతుల్లోకి తీసేసుకుంటాడు. బ్యాంకు అకౌంట్లను హ్యాక్ చేసేయడం.. డబ్బులు లాగేయడానికి సంబంధించిన సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. మాస్క్ వేసుకుని హీరో చెప్పే డైలాగులు.. అతను చేసే పనులు చూస్తే ఆసక్తి సన్నగిల్లిపోతుంది. హీరో మిషన్ ఏంటో తెలిశాక.. ఇక క్లైమాక్స్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడటమే మిగులుతుంది.

‘ఇజం’ క్లైమాక్సులో కూడా కొత్తదనం ఏమీ లేదు. ఐతే దాన్ని తీర్చిదిద్దిన విధానం మాస్ ప్రేక్షకుల్ని అలరించొచ్చు. అందులో వచ్చే డైలాగులు ఓ వర్గం ప్రేక్షకుల్లో ఉత్తేజం రేకెత్తిస్తాయి. ఆ సన్నివేశంలో కళ్యాణ్ రామ్ పెర్ఫామెన్స్ నందమూరి అభిమానుల్ని ఆకట్టుకోవచ్చు. సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలు క్లైమాక్స్.. యాక్షన్ సన్నివేశాలే. బేసిక్ ప్లాట్ బాగున్నా దాన్ని డీల్ చేసిన విధానం బాలేకపోవడంతో ‘ఇజం’ అంచనాల్ని అందుకోలేకపోయింది. నందమూరి అభిమానులకు కళ్యాణ్ రామ్ మేకోవర్.. అతడి పెర్ఫామెన్స్ ఆకట్టుకోవచ్చు. మాస్ ప్రేక్షకుల్ని ‘ఇజం’ కొంతవరకు సంతృప్తి పరచవచ్చు.
 
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తాడు ‘ఇజం’లో. లుక్.. యాక్టింగ్ పరంగా అతడికి ఈ సినిమా మేకోవరే. అతడి కష్టం తెర మీద కనిపిస్తుంది. హీరోయిన్ అదితి ఆర్య ఏమంత ఆకట్టుకోదు. కొన్నిసార్లు క్యూట్ గా అనిపిస్తుంది కానీ.. హీరోయిన్ గా ఆమెను చూస్తే ప్రేక్షకుల్లో ఏమంత ఎగ్జైట్మెంట్ కలగకపోవచ్చు. ఆమె నటన గురించి చెప్పడానికేం లేదు. జగపతి బాబు ఎప్పట్లాగే స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చాడు. కానీ ఆయన పాత్రను పూరి తేల్చిపడేశాడు. అసలు ఈ సినిమాలో జగపతి పాత్ర ఏంటో కూడా చెప్పడం కష్టం. ‘నాన్నకు ప్రేమతో’ లాంటి సినిమాల్లో జగపతి బాబును గుర్తు తెచ్చుకుని.. ఈ క్యారెక్టర్లో చూస్తే ఏదోలా అనిపిస్తుంది. తనికెళ్ల భరణి బాగా చేశాడు. వెన్నెల కిషోర్ మొదట్లో కాస్త నవ్వించాడు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం: అనూప్ రూబెన్స్ పాటల్లో ఒకటి రెండు పర్వాలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్ శ్రావ్యంగా ఉంది. నేపథ్య సంగీతం విషయంలో అనూప్ సర్ప్రైజ్ చేస్తాడు. తాను కూడా కమర్షియల్ సినిమాలకు సరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వగలనని రుజువు చేశాడు. ముఖేష్ ఛాయాగ్రహణం సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో ఒకటి. ఛేజ్ సీన్లలో.. యాక్షన్ ఎపిసోడ్లలో అతడి పనితనం కనిపిస్తుంది. నిర్మాణ విలువల విషయంలో కళ్యాణ్ రామ్ రాజీ పడలేదు. సినిమా రిచ్ గా తెరకెక్కింది. ఇక పూరి జగన్నాథ్ రైటింగ్ దగ్గరే నిరాశ పరిచాడు. ఆయన రైటింగ్ లో ఒకప్పుడున్న స్పార్క్ మిస్సయింది. పూరి ముద్ర కనిపించలేదు ‘ఇజం’లో. ఒకప్పుడు కథ ఎలా ఉన్నా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసేవాడు పూరి. ఐతే గత కొన్ని సినిమాల తరహాలోనే ఇందులోనూ స్క్రీన్ ప్లే మైనస్ అయింది. అనాసక్తికర కథనం.. మామూలు సన్నివేశాలతో పూరి నిరాశ పరిచాడు.

చివరగా: పూరి 'ఇజం'.. డెప్త్ లేదు బాస్

రేటింగ్: 2.5/5

ThanQ Visit Again.

Related Posts