ఈ సంవత్సరం ఎండలు , వానలు అధికమేఈ యేడాది కుంభవృష్టే... జూన్ నెల నుంచే ఆరంభం.. వేసవి ఎండలూ అంతే స్థాయి
దేశ ప్రజలకు ప్రత్యేకించి రైతులకు ఓ శుభవార్త. ఈ యేడాది సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖతో పాటు.. అనేక వాతావరణ కేంద్రాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా గత యేడాది కంటే ఈ యేడాది మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కారణ ఎల్‌నినో ప్రభావం తొలిగిపోనుండటమేనట.
అదేసమయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఈ యేడాది ఈ వేసవి మంటలు పుట్టించనుంది. ఎల్‌నినో ప్రభావం బలహీనపడినట్టేనని భారత వాతావరణ విభాగం సహా పలు వాతావరణ సంస్థలు స్పష్టంచేస్తున్నాయి. దాని ఫలితంగా ఈ వర్షాకాలం పుష్కలంగా వానలు పడతాయని వెల్లడించాయి. దీంతో ఈ ఏడాది 1.2 శాతంగా ఉన్న వ్యవసాయరంగ వృద్ధి ఏకంగా ఆరు శాతానికి పెరుగవచ్చని అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా వచ్చే జూన్ నెలలోనే మంచి వర్షపాతం నమోదవుతుందని తెలిపాయి. ఇది సాధారణ స్థాయికంటే సుమారు 25 శాతం అధికంగా ఉంటుందని వెదర్ రిస్క్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సీనియర్ కన్సల్టెంట్ (క్లైమేట్ సైన్సెస్) క్రాంతిప్రసాద్ వెల్లడించారు. జూన్‌ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ సాధారణస్థాయి కొనసాగుతుందని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావం ఇప్పటికే గరిష్టస్థాయికి చేరుకుందని, బలహీనపడటం మొదలవుతుందని అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు పలు దేశాల వాతావరణ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ నాటికి ఎల్‌నినో ప్రభావం పూర్తిగా అంతరించిపోతుందని స్కైమెట్ వైస్ ప్రెసిడెంట్ జీపీ శర్మ చెప్పారు. వర్షాలు సాధారణంకంటే ఎక్కువున్నా, తక్కువున్నా, సెప్టెంబర్ తర్వాత లా నినా ఏర్పడుతుందని ఆయన అంచనా వేశారు. లా నినా అనేది ఎల్ నినో పరిస్థితికి భిన్నమైనది. ఈ పరిస్థితి భారత్‌ సహా ఆసియా దేశాల్లో చక్కటి వర్షాలకు కారణమవుతుందని తెలిపారు.
రాబోయే వర్షాకాలం ఆశాజనకంగా ఉండనున్నప్పటికీ.. ఇప్పటికే ప్రవేశించిన వేసవి.. రానున్న రోజుల్లో చండ్రనిప్పులు కురిపించే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్-జూన్ నెలల మధ్యలో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరించింది. వాయవ్య, మధ్యభారత రాష్ట్రాల్లో వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని, సాధారణ ఉష్ణోగ్రతలకంటే ఐదు నుంచి ఆరు డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది.
ThanQ Visit Again.

Related Posts